మహాభారతంలో సభా పర్వానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆధునిక భారతంలో చట్టసభలకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది. అక్కడ చేరిన వారు చర్చించేది కోట్లాది మంది ప్రజల గురించి, వారి చీకటి జీవితాలలో కొత్త వెలుగులు పూయించేందుకు చేసే ప్రయత్నాల గురించి. దాంతో జనమందరి చూపూ శాసనసభ మీదనే ఉంటుంది. అక్కడ ఏం జరుగుతుందన్నది కూడా ఆసక్తిగా తిలకిస్తారు. తమ గోడు పట్టించుకున్నారా, లేదా అన్నది కూడా ఆశగా ఆలకిస్తారు. మరి చట్టసభలలో జరుగుతున్నది ఏంటనేది ఒకసారి సమీక్షించుకుంటే బాధ కలుగుతుంది. చట్టసభలలో అసలు విషయాలు పక్కకు పోతున్నాయి. జనగణమన అంటూ జాతీయ గీతాన్ని ఆలపించేంత వరకే సభ నియంత్రణలో ఉంటోంది. ఆ తరువాత అటూ ఇటూ గొడవలూ, అరుపులూ కేకలతో అదుపు తప్పుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశంలో మంచి బిల్లులనే ప్రవేశపెట్టారు. వాటి మీద చర్చ సాగకుండా మాత్రం అడ్డంకులు ఏర్పడుతున్నాయి.

         సభా సంప్రదాయాలు కూడా మంట కలుస్తున్నాయా అన్నది ఎవరికీ అర్ధం కావడం లేదు. తన మీదకు ప్రతిపక్ష నాయకుడు పేపర్స్ విసురుతున్నారని సభాపతి మధనపడుతూంటే, తన మీదకు ఆయనే పేపర్స్ విసిరారని విపక్ష నేత విమర్శ చేస్తున్నారు. ఈ రెండూ కూడా బాధాకరమే. ఎవరు చేసినా అది చింతించాల్సిన విషయమే. అసలు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నవారే అక్కడ ఉన్నారు. అందరూ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చిన వారే. అందరూ ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసంతో ఉంటామని ప్రకటించినవారే. మరి ప్రజాస్వామ్యం అంటే ఏమిటి? ఓరిమి, సహనం, నిగ్రహం ఉండాలి. ఎదుటి వారు విమర్శ చేసినా కూడా భరించగలిగే శక్తి ఉండాలి. వారు చెప్పే దాని నుంచి మంచి ఉంటే గ్రహించాలి, లేకపోతే లేదు, కానీ గొంతు నొక్కేయకూడదు. అలా కనుక చేస్తే దానిని ప్రజాస్వామ్యమని అనగలరా? కానీ పేరుకు ప్రజాస్వామ్యమే అమలవుతున్న వేళ ఇవన్నీ అలాగే జరిగిపోతున్నాయి. అనుభవాలు ఒకరికి ఉపయోగపడాలి. అలా కాని నాడు అవి ఎందుకు? నాకు ఇన్నేళ్ల అనుభవం ఉందని నాయకులు అనుకోవడం కాదు, వాటిని ఆచరణలో చూపించుకోవాలి. ఇక అధికార పక్షాన్ని జనంలో పలుచన చేయాలని సంకుచితమైన దృష్టిలో చూడడం వల్లనే అసలు సమస్య వస్తోంది. అలా ఎందుకు అనుకోవాలి. ఆ రకమైన ఆలోచనలు చేయడమే తప్పు. మంచి ఉంటే దానిని స్వీకరించాలి. ప్రజల కోసం ప్రభుత్వం ఏదైనా మంచి పని చేస్తుంటే దానిని హర్షించే విశాల హృదయం ప్రతిపక్షానికి ఉండాలి. అదే విధంగా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే మాత్రం దానిని కచ్చితంగా ఖండించాలి. అయితే అధికార పక్షానికి అర్ధమయ్యేలా చెప్పాలి. అందులో రాజకీయాలు చూడాలనుకుంటేనే తంటా వస్తోంది.

     నిజానికి ఇవన్నీ అద్భుతాలు ఏమీ కావు. చేయాలనుకుంటే చేయవచ్చు. ముందుతరం ప్రజా ప్రతినిధులు అలాగే చేసేవారు. దేశమంతా తనను అపరిమితంగా ఆదరిస్తున్న వేళ పార్లమెంట్‌లో తనకు ఎదురులేని వేళ కూడా పండిట్ జనహలాల్ నెహ్రూ, నాటి యువ ఎంపీ, విపక్ష నాయకుడైన అటల్ బిహారీ వాజ్ పేయికి మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారు. నెహ్రూ ప్రభుత్వ పాలన రోజుల్లో జనసంఘ్ కు ఎంపీగా ఉన్న వాజ్ పేయి గట్టిగా విమర్శిస్తూంటే, నెహ్రూ ఆయన చెప్పినదంతా విన్నారు. ఎక్కడా కూడా ఆటంకం కలిగించలేదు. తన వయసులో, రాజకీయంలో ఏ మాత్రం సరితూగని నాటి యువ ఎంవీ విమర్శలు తాను వినేదేంటి అని ఏ మాత్రం అనుకోలేదు. అదొక్కటే ఉదాహరణ కాదు. చరిత్ర తవ్వితీస్తే ఎన్నో ఇలాంటివి కనిపిస్తాయి. వాటిని స్ఫూర్తిగా తీసుకుంటేనే సభా పర్వానికి సరికొత్త అర్ధం. అందం.