దేశానికి పట్టెడన్నం పెట్టే రైతన్నల పరిస్థితి అతివృష్టి, అనావృష్టిల దాటికి నేడు అతలాకుతలం అవుతోంది. దేశానికి రక్షించే జవాన్‌లకు ఎంత ప్రాముఖ్యత ఉందో పట్టెడన్నం పెట్టే అన్నదాతలకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. అందుకే ''జై జవాన్... జై కిసాన్'' అనే నినాదం యావత్ భారతవనిలో వినిపిస్తుంది. దేశానికి వెన్నుముకగా రైతులను అభివర్ణిస్తారు. భారత మాజీ ప్రధాని చరణ్‌సింగ్ జన్మదినమైన రోజు డిసెంబర్ 23న 'రైతు దినోత్సవం' (కిసాన్ దివాస్) జరుపుకుంటున్నారు. రైతు దినోత్సవంపై ఈ వారం సండేస్పెషల్... నవతెలంగాణ-
రైతు దినోత్సవం ఇలా..
అంతర్జాతీయ వ్యవసాయదారుల దినోత్సవం ఏప్రిల్ 17న జరుపుతారు. అయితే మనదేశానికంటూ ప్రత్యేకంగా వ్యవసాయ దారుల దినోత్సవం ఉండాలనే లక్ష్యంతో మాజీ ప్రధాన మంత్రి చౌదరి చరణ్ సింగ్ జన్మదినోత్సవాన్ని అందుకు ఎంచుకున్నారు. చౌదరి చరణ్ సింగ్ చేపట్టిన ఉద్యమాల ఫలితంగానే జమీందారీ చట్టం రద్దు అయి, కౌలుదారీ చట్టం వచ్చింది. పేదలకు భూముల పంపిణీ, వ్యవసాయదారులకు అనుకూలమైన పలు రకాల విధానాలను రూపొందించడం, రైతులను వడ్డ వ్యాపారుల కబంధ హస్తాల నుండి విడిపించి వారికి బ్యాంకు రుణాలు అందించే విధానం ప్రవేశపెట్టేలా చేయడం వెనుక చరణ్ సింగ్ నిర్వహించిన రైతు ఉద్యమాలున్నాయి.
బలవన్మరణాలకు కారణాలు...
ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయం ఒక జూదంగా మారింది. ఒకరోజు వర్షాల కోసం.., ఇంకోరోజు విత్తనాల కోసం.. మరో రోజు ఎరువుల కోసం.., బ్యాంకు రుణాల కోసం ఇలా ప్రతి విషయం లోనూ ఒత్తిళ్లకు గురి కావాల్సిన పరిస్థితి రైతులకు ఏర్పడుతోంది. ఒత్తిళ్లు, నష్టాలు, వ్యవసాయ పనుల చాకిరీ భరించలేక చాలామంది భూమి ఉన్నా వ్యవసాయం మానేస్తున్నారు. కొందరు భూమిని కౌలుకు ఇస్తున్నారు. ఎన్నికల్లో పార్టీలు రైతులకు ఎన్ని హామీలిచ్చినా రైతుల పరిస్థితి మాత్రం మారడం లేదు. పంటలు సాగు చేసి దిగుబడి రాక అప్పుల బాధలు భరించలేక, సరైన సమయంలో రుణమాఫీ కాక, దిక్కు తోచని స్థితిలో రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.
కౌలు రైతుల పరిస్థితి..
కౌలు రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. భూమి వారిది కాదు..పంట పండితే పూర్తి పంట చేతికి రాదు..వీరికి వ్యవసాయ రుణాలు కూడా రావు. సొంత భూమి లేకపోవడం, భూమి కౌలుకు తీసుకుంటే ఎక్కువ రేట్లు చెల్లించడం, భూమి యాజమాని కాకపోవడం వల్ల పంటరుణానికి ఎవరూ నమ్మడం లేదు. దీంతో రూ.5, 10ల ప్రైవేటు వడ్డీల మీద ఆధారపడి వీరు వ్యవసాయం చేస్తున్నారు. ప్రభుత్వం కౌలు రైతులకు ఇచ్చిన రుణఅర్హత పత్రాలకు బ్యాంకర్లు రుణాలు ఇవ్వకపోవడంతో ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల మీద ఆధారపడి అప్పుల పాలవుతున్నారు.
దళారుల చేతిలో...
కష్టపడి కాలానికి ఎదురీది పంటలు పండిస్తే దళారులు రైతుల మీద పడి దోచుకుంటున్నారు. మార్కెట్లో తిష్టవేసిన దళారులు రైతుల శ్రమను చౌకగా కొని ఎక్కువ రేట్లకు జనాలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో రైతులు కూలీగా మిగులుతుంటే దళారులు లక్షాధికారులు అవుతున్నారు. ఈ దళారుల వ్యవస్థను అరికట్టే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకొని రైతును రాజుగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక పంటల విషయంలో రైతులకు సలహాలు సూచనలు ఇవ్వాల్సిన వ్యవసాయ శాఖలో సిబ్బంది కొరత రైతులను నష్టాలకు గురి చేస్తోంది.
రైౖతన్న ఒక్క క్షణం ఆలోచించు..
కష్టాలసాగు కడగండ్లు మిగిల్చినా రైతులు గుండెనిబ్బరం చేసుకోవాలి.. ఒక్కసారి కుటుంబం గురించి ఆలోచించుకోవాలి. భార్య, పిల్లల పరిస్థితి ఏమిటని ప్రశ్నించుకోవాలి. కష్టాలు ఈ రోజు ఉండచ్చు... రేపు పోవచ్చు.. దేశానికి అన్నం పెట్టే రైతన్నే అధైర్య పడితే ఈ సమాజానికి మెతుకు దొరకదు. ఇప్పటికీ ఎక్కడో ఓ చోట రైతు ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. అందుకే రైతన్నలు బతికి సాధించాలని మేధావులు, స్వచ్ఛంద సంఘాలు కోరుతున్నాయి.


0 Comments