వంటింట్లో గరిట తిప్పడానికే పరిమితం కాదు.. పురుషులతో సమానంగా ఏ రంగాల్లోనైనా దూసుకెళ్లేందుకు మేం సిద్ధమంటోంది నవతరం స్త్రీ జాతి. అన్నట్లుగానే పురుషులకు ఏమాత్రం తీసిపోని విధంగానే అన్ని రంగాల్లోనూ ముందంజలో దూసుకెళ్తున్నారు. ఇటీవలి నేను హాంకాంగ్‌ మీదుగా అమెరికాకు బయల్దేరి వెళ్లాను. హాంకాంగ్‌లో విమానం టేకాఫ్‌ అయినప్పుడు విమానాశ్రయంలోనే కొన్ని గంటలపాటు వున్నాను. అక్కడ ఏ కౌంటర్‌లో చూసినా ఆడపిల్లలే దర్శనమివ్వడాన్ని చూసి ఒకింత ఆశ్చర్యానికి గురయ్యాను. మన దేశంలో వున్న పరిస్థితికి పూర్తి భిన్నంగా వుందా విమానాశ్రయం. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్ఠత వెనక స్త్రీ జాతి దన్నుగా నిలుస్తోందని అర్థమైంది.

               భారత్‌లో నేడు కొంతమంది ధీర వనితలు ఆయా రంగాల్లో ఎన్నో సేవల్ని అందిస్తూ అద్భుతమైన ప్రగతి సాధిస్తున్నారు. దేశ ఔన్నత్యాన్ని చాటుతూ ప్రపంచ గమనంలో దూసుకెళ్తున్నారు. కానీ దేశంలో తరతరాలుగా వ్యాపిస్తోన్న పురుషాధిక్యత నవతరం స్త్రీ ఉన్నతికి అడ్డంకిగా మారుతోంది. ప్రత్యేక హక్కులు కల్పించినా, అన్ని రంగాల్లో రిజర్వేషన్లు అమలుచేసినా వాటిని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవుతున్నారు. చిన్నప్పట్నుంచే కొన్ని నియమనిబంధనలతో కూడిన ఆంక్షలు విధించడం ద్వారా వారు స్వేచ్ఛగా ఏ పనీ చేయడానికి స్వతహాగా ముందుకు రాలేకపోతున్నారు. ఇతర దేశాల స్త్రీలతో సమానంగా రాణించలేకపోతున్నారు. సంప్రదాయాలు, కట్టుబాట్ల పేరుతో స్త్రీ స్వేచ్ఛ, ఉన్నతిని అడ్డుకోవడం సరికాదు. అందుకే మనం ఎన్ని దశాబ్ధాలుగా మహిళా సాధికారత గురించి మాట్లాడుతున్నా నేటికీ నీటి మూటగానే మిగిలిపోతోంది. ప్రతీ ఐదేళ్లకొకసారి రాజకీయ పార్టీల మేనిఫెస్టోల్లో ప్రకటనలకే పరిమితమవుతోంది తప్ప ఆ దిశగా ఇసుమంతకూడా ప్రయత్నాలు జరగడంలేదు.
హాంకాంగ్‌, చైనా లాంటి అనేక దేశాల్లో అన్ని కీలకరంగాల్లోనూ స్త్రీలు కీలకస్థానాల్లో వెలుగుతున్నారు. పురుషులతో సమానంగా పనిచేస్తూ వారికి ఏమాత్రం తీసిపోనివిధంగా వ్యవహరిస్తూ మన్ననలు అందుకుంటున్నారు. హాంకాంగ్‌లోనైతే చేస్తున్న పనుల్లో ఎలాంటి తారతమ్యం లేకుండా వారంతా సోదర భావంతో మెలగడం, కలిసిమెలిసి వుండటం నన్నెంతగానో ఆకట్టుకుంది. మన దేశంలో తరతరాలుగా స్త్రీలు ఇంటికి పరిమితమవుతూనే రావడం వల్ల నేటి పిల్లల్లోనూ అదే భావం పాతుకుపోయింది. బయట సమాజంతో తమకేమీ సంబంధం లేదనుకొనే వ్యక్తిత్వం పెంపొందుతోంది. దాన్ని మార్చే దిశగా ప్రభుత్వాలు విస్తృతంగా అవగాహన కల్పించాలి. స్త్రీలను ఆర్థిక వ్యవస్థలు భాగస్వాముల్ని చేయడంలో ప్రభుత్వాలు చురుకైన పాత్ర వహించాలి.
               సమాజానికి దూరంగా బతుకుతున్న ఎస్సీ, ఎస్టీలను కలుపుకొని సామాజిక పరివర్తనకు కృషిచేయాలి. ఒకరిపై ఒకరు అనురాగంతో మెలిగేలా వాతావరణాన్ని కల్పించాలి. స్త్రీలు, పురుషులు కులాలు, మతాలకు అతీతంగా ఎవరికివారుగానే అభివృద్ధి సాధించి దేశ సమగ్రతకు, ఐక్యతకు కృషిచేయాలి. ముఖ్యంగా, నేటి యువతకు ఉన్నత విద్యా రంగంలో అపరిమితమైన కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ప్రాధాన్యత గల కోర్సులు చదివి, ఎన్నో వ్యయప్రయాసలకోర్చి విద్యాభ్యాసాన్ని పూర్తిచేసిన ఎంతోమంది యువతులు చివరకు వంటింటికే పరిమితం కావడం నిజంగా విచారకరం. దేశ ఎకానమీకి తన వంతు తోడ్పాటునందించే అవకాశాన్ని నవతరం నారీమణులు అందిపుచ్చు కోవాలి. వారికి యావత్‌ సమాజం అండదండలివ్వాలి.