నేలను నమ్ముకున్న రైతుకు వ్యవసాయం ఒక జీవనవిధానం. వాణిజ్యం అతని అభిమతం కాదు. పంటలు పండించడమే తప్ప వాటిని లాభనష్టాలతో బేరీజు వేసే నైజానికి దూరం. పశువులు, పంటలు రైతు జీవితంలో అంతర్భాగం. వ్యవసాయం ప్రకృతి నేర్పిన విద్య. అందుకే ప్రకృతికి దగ్గరగా, ప్రకృతిలో అంతర్భాగంగా సాగుతుంది రైతు జీవనపోరాటం. కదిలే మబ్బులను, కాలం కదలికలను, రుతువుల ఆగమనాన్ని అసంకల్పితంగా, ఆశగా గమనించడం రైతు స్వభావం.
''తన చిన్న మడిచెక్కను జాగ్రత్తగా చూసుకొంటూ పూర్తి స్వేచ్ఛ, కావలసినంత తీరికతో ప్రతిరోజూ గడపటమే అసలయిన వ్యవసాయ విధానం'' అని జపనీస్ ప్రకృతి తత్వవేత్త మసనోబు ఫుకుఓకా అన్నారు. అందువల్లనే జపాన్లో రైతులు తమ తీరికవేళల్లో హైకూ కవితలు రాసేవారు. మన దగ్గర కూడా వ్యవసాయం చేస్తూ కవిత్వం రచించిన బమ్మెరపోతన గురించి తెలిసిందే. ఆధునిక కాలాన రైతు జీవితాన్ని గురించి 'కాపుబిడ్డ' శీర్షికన తొలి కావ్యాన్ని రచించిన గంగుల శాయిరెడ్డి కూడా వ్యవసాయదారుడే. వ్యవసాయం వాణిజ్యం కాకముందు, మరీ ముఖ్యంగా అభివృద్ధి పేరిట, అధునాతన యంత్రాలకీ, సరిపడని ఎరువులకీ, పురుగు మందులకీ బలికాకముందు రైతులకు తీరిక ఉన్నమాట వాస్తవం. వ్యవసాయ పనులు పూర్తయిన తరువాత రైతులు రెండు మూడు నెలలపాటు తీరికగా ఉండేవారు. ఇవాళ ఇందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి నెలకొంది. ఊపిరాడని పనుల్లో రైతులు చిక్కుకుపోయారు. అసలు వ్యవసాయమే జూదంగా మారిపోయి, దినదినగండం నూరేళ్ళ ఆయుష్షుగా బతకాల్సిన స్థితి దాపురించింది.
ఈ విషాదాన్ని కవులు, రచయితలు తమ సృజనాత్మక రచనల ద్వారా చిత్రిక పడుతూనే వున్నారు. కష్టానికి ఫలితం దక్కక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడే రైతు దుర్భర జీవితాన్ని 'పైపంట' నాటికలో నార్ల వెంకటేశ్వరరావు ఏనాడో దృశ్యమానం చేశారు. 1978లోనే 'రైతు జీవితం అప్పుల మయం' కావడాన్ని సింగమనేని నారాయణ తన కథల్లో చిత్రించారు. మట్టిని నమ్ముకొని ఆరుగాలం కష్టపడే రైతుకు వ్యవసాయం 'జూదం'గా పరిణమించిన కరకు వాస్తవాన్ని కథాత్మకం చేశారాయన. 1980లో వానమామలై జగన్నాథాచార్యులు రాసిన 'రైతు రామాయణం' భూమి దు:ఖాన్ని అక్షరీకరించింది. ఏళ్ళు గడుస్తున్నా సేద్యం బాధలు తీరకపోగా బతుకే భారంగా పరిణమించింది రైతాంగానికి. దరిమిలా 1990ల కాలం నుంచి 'రైతు జీవితం ఆత్మహత్యలమయం' కావడాన్ని చూస్తున్నాం.
రైతు దేశానికి వెన్నెముక, అన్నదాత, భూమిని సారవంతం చేసే శ్రమైక జీవన సౌందర్యం తెలిసిన మనిషిగా పొగడ్తలు కురిపించే నేతలకు కొదవలేదు. వాస్తవంలో రైతు జీవితం ఇందుకు పూర్తి భిన్నం. కాలం గడుస్తున్న కొద్దీ స్వేదం చిందించి సేద్యం చేసే రైతు బతుకులో పెను బీభత్సం నెలకొన్నది. సరళీకృత ఆర్థిక విధానాల అమలు నేపథ్యంలో వ్యవసాయం కనాకష్టంగా పరిణమించింది. స్వేచ్ఛగా, పరిపూర్ణంగా బతుకు సాగించే రోజులు గతించాయి. రైతులు ఏ పంటలు వేయాలో బహుళజాతి సంస్థలు నిర్దేశించడం వ్యవసాయానికి పెను సంకటంగా మారింది. నిర్దిష్ట వ్యవసాయ విధానమంటూ లేకపోవడం, నేల స్వభావానికి విరుద్ధమైన వాణిజ్య పంటలు సాగు చేయాల్సి రావడం, తన విత్తనాలకు తాను పరాయివాడు కావడం రైతుల పాలిట శాపాలయ్యాయి. మార్కెట్ శక్తుల వ్యూహ ప్రతివ్యూహాల్లో పండిన పంటకు గిట్టుబాటు ధర రాక, చేసిన అప్పులు తీర్చలేక, ఆత్మగౌరవానికి భంగం వాటిల్లిన క్షణాన ఆత్మహత్యలనే శరణ్యంగా భావిస్తున్నారు రైతులు. వందలు, వేలుగా రైతులు తమ ప్రాణాల్ని తీసుకుంటున్నప్పటికీ ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయి. తెలుగునాట వాణిజ్య పంటల జూదం పెచ్చరిల్లినప్పట్నించి ఆత్మహత్యల పర్వం కొనసాగుతూనే వుంది. చిన్నచిన్న కమతాల వాళ్ళు భూములు అమ్ముకొని కూలీలుగా మారుతున్నారు. పుట్టిన నేలను, ఉన్న ఊరును విడిచి వలసపోతున్నారు. మరోవైపున ప్రత్యామ్నాయం లేక వ్యవసాయం చేస్తున్న రైతుల కాళ్ళ కింద భూమిని కూడా లాగేసుకుంటున్నాయి ప్రస్తుత ప్రభుత్వాలు. ప్రాజెక్టుల పేరిట, పరిశ్రమల పేరిట వందల, వేల ఎకరాల భూముల నుంచి రైతుల్ని తరిమేస్తున్నాయి. అభివృద్ధి పేరుతో ఊళ్ళకు ఊళ్ళను కబళించే విధానాల్ని అనుసరిస్తున్నాయి.
రైతే రాజు అని చెప్పిన అధినేతలు ఆ రైతుల నోట్లో మట్టి కొట్టడానికి వెనుకాడ్డం లేదు. ఇలాంటి సంక్షోభ సందర్భాల్లో పాలకుల్ని నిగ్గదీసి, ప్రశ్నించే అక్షరాల్ని సంధించడం సృజనశీలుర బాధ్యత. నాగలిని శిలువగా మోస్తూ నడిచే రైతుల పక్షాన నిలబడి గొంతెత్తడం కవుల, కళాకారుల కర్తవ్యం. రైతు విలాపాన్ని తీర్చే విధివిధానాల రూపకల్పనలో నిర్లక్ష్యాన్ని, అలసత్వాన్ని నిరసించడం అనివార్యం. గ్రామీణ జీవితం, అందునా రైతు జీవితం ఇవాళ్టి ఎజెండా కావడం, ప్రధాన ఇతివృత్తం అవడం అవసరం. నిమగత తప్పనిసరి. పదిమందికి అన్నం పెట్టే నేల కదలిపోతుంటే, ఆ నేలను నమ్ముకున్న రైతులు అసువులు బాస్తుంటే నిర్లిప్తంగా ఉండడం క్షంతవ్యం కాదు. రైతు కవిత్వ నాయకుడు కావాలి. కలాలు, గళాలు ఈ దిశగా పదునెక్కడం వాటికి ధన్యత.


0 Comments