మార్కెట్‌శక్తుల దాష్టీకానికి భూములు, పంటలు, రైతులు కకావికలమయ్యే సంక్షుభిత స్థితి నెలకొంటుంది. లాభాల పేరిట భూమిని తెగనమ్మే, వ్యవసాయాన్ని బలిపీఠం ఎక్కించే ఈ కుట్రల పట్ల సృజనలోకం స్పందించాల్సిన సమయమిది. భూమి చెక్కిళ్ళ మీది కన్నీటిని తుడిచే చేతులు సంఘటితం కావాల్సిన సందర్భమిది.


''ఘర్మజలము / కండబలము/ కంటినీరు - ఒంటినెత్తురు/ కాన్క వెట్టి - గడన చేసిన / ధాన్యరాసుల - తస్కరించే / రాజులుండేమి - రాజ్యముండేమి (రాజులుండేమి?)'' అని రైతును దోపిడిచేసే రాజ్యం దౌష్ట్యాన్ని అభిశంసిస్తూ పొట్లపల్లి రామారావు రాసిన కవితా వాక్యాలకు నేటికీ ప్రాసంగికత ఉంది. ఆనాడు దుర్మార్గమైన పన్నుల విధానంతో రైతుల శ్రమని కొల్లగొట్టేవి రాజరికాలు. ఇవాళ మార్కెట్‌శక్తుల ఇష్టారాజ్యానికి వదిలివేసి వ్యవసాయదారుల పంటల్ని అప్పనంగా దోచుకొనే విధానాలకు ప్రభుత్వాలు తెరదీశాయి. హరిత విప్లవం పేరునయినా, యాంత్రీకరణ పేరిటయినా కొన్ని దశాబ్దాలుగా వ్యవసాయాన్ని జూదంగా మార్చివేశారు. భూమిని నమ్ముకున్న రైతులకు దుఃఖాన్నే మిగిల్చారు. ఇపుడిక మొత్తంగా మార్కెట్‌శక్తుల దయాదాక్షిణ్యాలకు వదిలివేసే మహామేయ కుతంత్రాలకు తెరదీసింది కాషాయ పాలకప్రభుత్వం. 'సంస్కరణలు' అనే అందమైన పదజాలం పేరిట వ్యవసాయాన్ని పెట్టుబడిశక్తుల పరం చేసే కుటిల వ్యూహాల్ని అమలుచేయ జూస్తున్నది. ఇది భారతీయ వ్యవసాయ విధానానికి శరాఘాతం. ఇప్పటికే అనేకరకాల సమస్యలతో కుదేలైన రైతుల్ని వారి భూమిలోనే వారిని కూలీలుగా మార్చే విపత్కర పరిణామం.


వ్యవసాయం వాణిజ్యం కాదు అదొక జీవన విధానం అని పలికిన ప్రకృతి తత్వవేత్త మసనోబు ఫుకుఓకా చెప్పిన మాటల్ని ఏనాడో మరిచారు. ఫలితంగా వ్యవసాయం క్రూరమైనజూదంగా పరిణమించింది. ఆనాడు డంకెల్‌ విధానాలకు వ్యతిరేకంగా దేశం మొత్తం గొంతెత్తింది. అయినప్పటికీ గాట్‌ ఒప్పందాలపై సంతకం చేసిన పాలకుల పాపంతో వ్యవసాయరంగం దెబ్బతిన్నది. నాటి నుంచి రైతుల ఆత్మహత్యల సంఖ్య నానాటికీ పెరుగుతున్నది. ఇపుడు సంస్కరణల పేరిట వ్యవసాయ రంగాన్ని సంపూర్ణంగా మార్కెట్‌శక్తుల పరం చేయడం పెను ప్రమాదం. తాజా సంస్కరణల పర్వం మొత్తం వ్యవసాయ భూముల్నే కబళించే ఆక్టోపస్‌.


కరోనా వ్యాప్తి నేపథ్యంలోనూ పాలకులు వివేచనతో వ్యవహరించడం లేదనే సంగతి ఇటీవలి పరిణామాల్ని గమనిస్తే బోధపడుతుంది. వ్యవసాయ రంగంలో సాగుని నియంత్రించడం, సహకార సంఘాల పేరిట భూమిని కాంట్రాక్టు పద్ధతిన ప్రయివేటు పరం చేసే కుట్రలకు పచ్చజెండా ఊపడం మన భూములకీ, రైతులకీ చేటుకాలం. దీన్ని ప్రతిఘటించకపోతే కోట్లాదిమంది రైతులు, కూలీలు మరింత సంక్షోభంలోకి కూరుకుపోతారు. పంటని ఎక్కడయినా అమ్ముకునే స్వేచ్ఛ ఉందంటూ మార్కెట్‌కు వదిలేస్తే వాటిల్లే పరిణామాల్ని చూస్తూనే ఉన్నాం. ఉత్తర భారతంలో గోధుమ పంట సమృద్ధిగా పండినా ప్రభుత్వం, ఎఫ్‌.సి.ఐ. కొనడం లేదు. కనీస మద్దతు ధర కన్నా తక్కువగా వ్యాపారవేత్తలకు అమ్ముకోక తప్పని స్థితిలోకి రైతులు నెట్టబడ్డారు. మున్ముందు ఈ వాణిజ్య వికృతత్వం మరింత అమానుష రూపం దాల్చనుంది.


ఒక వైపున స్వావలంబన, స్థానికత గురించి గంభీరంగా చెప్పిన మాటలు ఉత్త ప్రగల్బాలే అని తాజా వ్యవసాయ సంస్కరణల ఉదంతం తేల్చివేసింది. స్థానికంగా తమ నేల స్వభావం, వాతావరణం, స్థానిక అవసరాల్ని దృష్టిలో పెట్టుకొని పంటల్ని సాగుచేయడం వివేచనతో ఎంచుకునే పద్ధతి. కానీ వ్యవసాయదారులు ఏం పండించాలో ప్రభుత్వాలు, మార్కెట్లు నిర్దేశించడం అసమంజసం. లాభాల చెరలాటతో కూడిన వ్యూహాలు అంతిమంగా అన్నదాతలకు ఉరితాడు బిగించనున్నాయి.


వ్యవసాయం చేయడం ఒక సృజనాత్మక జీవన విధానం. భూమి సహజ స్వభావాన్ని అర్థం చేసుకొని వ్యవహరించడం రైతు నైజం. కానీ ఇవాళ అంతర్జాతీయ మార్కెట్ల లాభాపేక్ష భూమిని చెరబట్టింది. వ్యవసాయాన్ని మార్కెట్ల దుర్మార్గమైన క్రీడగా దిగజార్చింది.
''తన చిన్న మడిచెక్కను జాగ్రత్తగా చూసుకొంటూ, పూర్తి స్వేచ్ఛ, కావలసినంత తీరికతో ప్రతిరోజు గడపటమే అసలయిన వ్యవసాయ విధానం'' అని మసనోబు ఫుకుఓకా అన్నారు. కానీ ఈ తీరిక, స్వేచ్ఛ రైతులకు ఎండమావులుగా నిలిచిపోయాయి. వ్యవసాయం నమ్ముకున్న రైతులు రంది పడని రోజంటూ లేదు. దుఃఖంతో కుమిలిపోని కాలం లేదు. ఆరుగాలం స్వేదం చిందించి సమృద్ధిగా పంటలు పండించినా గిట్టుబాటు ధరకు హామీ లేదు. వానమామలై వరదాచార్యులు 1980లో రాసిన 'రైతు రామాయణం' భూమి దుఃఖాన్ని వినిపించింది. ఆ వలపోత ఇప్పటికీ ఆగలేదు. ఇప్పుడు పెట్రేగిన సంస్కరణలతో వ్యవసాయం, భూములు మార్కెట్‌శక్తుల పెత్తందారీచేతుల్లోకి వెళితే రైతు బతుకు నిత్యరోదనంగా పరిణమిస్తుంది.


కరోనా విపత్తు జనాల్ని అతలాకుతలం చేస్తుండగా రైతు బతుకుని బీభత్సం చేసే దుర్మార్గం చెలరేగడం దుఃఖదాయకం. ''నగరాలు కాదు ముందు ఊర్లు బతకాలి / అన్నం పుట్టించే రైతు బతకాలి'' అంటారు కవి దర్భశయనం శ్రీనివాసాచార్య. అంతేగాక ''సింహాసనాల్ని పొలం దగ్గరికి ఈడ్చుకొచ్చి అడగాలి, చెంపలు వాయించి చెప్పాలి'' రైతుని ధ్వంసం చేసే విధానాలని మానుకొమ్మని అంటారు. దేశానికి వెన్నెముక రైతు అన్నది మరిచారు. ఆ రైతు బతుకులో కలోల్లం రేపే విధానాల పట్ల వర్తమాన కవులూ ధర్మాగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ''రైతు రక్తాన్ని కండ్ల జూస్తున్న / రేగు కంపనైనా, సర్కారు ముండ్లనైనా / ఒడుపుగా ఎలా కాలబెట్టాలో తెలుసు'' అంటున్న తగుళ్ళ గోపాల్‌ స్ఫూర్తి క్రియాశీలతని సంతరించుకోవాల్సిన సందర్భమిది. ''వ్యవసాయం నా ఆశయం, నేను రైతును అవుతా'' అంటాడు సలీం రాసిన ఓ కథలోని కథానాయకుడు. కానీ ఇవాళ అదంతా తారుమారయ్యే విపరిణామం తారాట్లాడుతున్నది. మార్కెట్‌శక్తుల దాష్టీకానికి భూములు, పంటలు, రైతులు కకావికలమయ్యే సంక్షుభిత స్థితి నెలకొంటుంది. లాభాల పేరిట భూమిని తెగనమ్మే, వ్యవసాయాన్ని బలిపీఠం ఎక్కించే ఈ కుట్రల పట్ల సృజనలోకం స్పందించాల్సిన సమయమిది. భూమి చెక్కిళ్ళ మీది కన్నీటిని తుడిచే చేతులు సంఘటితం కావాల్సిన సందర్భమిది.